భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్ గా మిగిలిపోయిన అఖిల్ లేటెస్ట్ సినిమా ఏజెంట్.. ఇప్పుడు మాడిఫికేషన్ పనుల్లో ఉందట. సినిమాలోని కొన్ని సీన్లు మార్చేసి కొత్త వర్షన్ ను ఓటీటీలో రిలీజ్ చేయటానికి సినిమా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. సినిమాలో బోరింగ్ గా అనిపించిన కొన్ని సీన్లను డిలీట్ చేయటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సమయంలో డిలీట్ చేసిన కొన్ని సీన్లను స్క్రీన్ ప్లే మార్చి సినిమాలో చేర్చబోతున్నారట. షూట్ చేసి సినిమాలో నుంచి లేపేసిన రష్ ను కొత్త స్క్రీన్ ప్లే తో సినిమాలో యాడ్ చేసి ఏజెంట్ కొత్త వర్షన్ ను తయారు చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా మాడిఫికేషన్ పనుల్లో ఉందనీ.. త్వరలోనే ఓటీటీలో రిలీజ్ అవుతుందని టాక్. అప్పుడెప్పుడో ఓటీటీ లో స్ట్రీమింగ్ కావాల్సిన ఏజెంట్ సినిమా.. థియేటర్లలో కంటే బెస్ట్ వర్షన్ ను తయారు చేసిన తర్వాతే రిలీజ్ చేయాలని నిర్ణయించుకుని ఓటీటీ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారట. త్వరలోనే ఫుల్ డిటైల్స్ అనౌన్స్ చేసే అవకాశముంది.
హిట్ సినిమాలు లేక డల్ అయిపోయిన హీరోలకు బ్రేక్ ఇచ్చి మళ్ళీ గాడిలో పెట్టే సెన్సేషనల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సుమారు 65 కోట్ల బడ్జెట్ తో ఏజెంట్ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం స్పై థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ నడుస్తుండటంతో అఖిల్ ఈ కథతో ప్రయోగం చేశాడు. కానీ పాపం.. ప్రయోగం బెడిసికొట్టి కనీసం ప్రమోషన్ కోసం ఖర్చుపెట్టిన డబ్బులు కూడా రాలేదు ఏజెంట్ సినిమాకు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సురేందర్ రెడ్డికీ.. బ్లాక్ బస్టర్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కు.. కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసిన హీరోయిన్ సాక్షివైద్యకు.. అక్కినేని ప్రేక్షకులకు.. ఇలా అందరినీ డిసప్పాయింట్ చేసింది ఈ సినిమా. ఇక ఓటీటీలో మాత్రం ఏం చేస్తుందో చూడాలి.