ఆదిపురుష్ సినిమాపై ఏ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తున్నదో రోజూ చూస్తూనే ఉన్నాం. డైరెక్టర్ ఓం రౌత్ ను మాత్రం జనాలు మామూలుగా తిట్టడం లేదు. ఇక హిందూ సంఘాల గురించి చెప్పాల్సిన పనే లేదు. కొన్ని సంఘాల వాళ్ళు ఆదిపురుష్ సినిమా బ్యాన్ చేయాలంటూ కోర్టుల్లో కేసులు వేస్తే.. మరి కొంత మంది ఆదిపురుష్ లోని చాలా సీన్లు మార్చాలని కోరుతున్నారు. ఏది ఏమైనా ఆదిపురుష్ సినిమా పట్ల నూటికి నూరు శాతం సంతృప్తితో ఉన్నది మాత్రం ఒక్కరు కూడా లేరు.. ఒక్క ఓం రౌత్ తప్ప. ఎవడెన్ని తిడితే మాత్రం ఏముంది.. ముందు కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూసుకోవాలనేది సినిమా యూనిట్ తాపత్రయంగా కనిపిస్తోంది. రామాయణం అనేది ఓ అద్భుతమనీ.. అది పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఊ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరనీ.. తనకు అర్థమైన యుద్ధకాండను మాత్రమే తాను సినిమాగా తీశానంటూ తాజాగా ఓం రౌత్ చేసిన కామెంట్లు జనాానికి విపరీతమైన కోపం తెప్పిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు డైలాగ్స్ రాసిన మనోజ్ ముంతాషిర్ అనే ఘనుడు తాము అసలు రామాయణం తీయనే లేదనీ..
రామాయణం స్ఫూర్తిగా తాము కొత్త కథ రాసుకొని దాన్ని మాత్రమే తెరకెక్కించామనీ చెప్పి జనానికి ఎక్కడో కాలేలా చేశాడు.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆదిపురుష్ సినిమా పంచాయతీ ప్రధాని మోడీ వద్దకు చేరనుంది. ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ అనే సంఘం వాళ్ళు ఆదిపురుష్ సినిమాను వెంటనే థియేటర్ల నుంచి తొలగించటమే కాకుండా ఎక్కడా ఎవ్వరూ చూడకుండా నిషేధించాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఓటీటీలో కూడా ఆదిపురుష్ స్ట్రీమింగ్ కాకుండా నిషేధం విధించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తాము నేరుగా ప్రధానమంత్రి మోడీని కలిసి ఆదిపురుష్ సినిమాపై కంప్లైంట్ ఇస్తామని చెప్పటం గమనార్హం. రామాయణం ప్రాశస్త్యాన్ని, శ్రీరాముడి గొప్పతనాన్ని ఆదిపురుష్ సినిమా నాశనం చేసి ప్రపంచం ముందు పరువు తీసిందని వారు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక ఈ సినిమాలో వాడిన డైలాగ్స్ చాలా దారుణంగా ఉన్నాయనీ.. కేవలం హిందూధర్మాన్ని నాశనం చేసి ప్రపంచం ముందు శ్రీరాముడిని కించపరచటానికే ఆదిపురుష్ సినిమా తీశారని ఆరోపిస్తున్నారు. త్వరలోనే దీనిపై ప్రధాని మోడీని కలిసి ఫిర్యాదు చేయటం మాత్రం తప్పదని హెచ్చరిస్తున్నారు.