పాన్ వరల్డ్ మూవీగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆదిపురుష్ సినిమా.. సినీ ట్రేడ్ వర్గాలు ఊహించిన దాని కంటే ఎక్కువ వసూళ్ళే సాధించింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్ 140 కోట్లుగా నమోదైందంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్ గా ట్వీట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టి ఆదిపురుష్ ఫస్ట్ డే 100 నుంచి 120 కోట్ల వరకు కలెక్షన్లు సాధించగలదనీ.. ఇది రికార్డుగా నిలిచిపోతుందనీ ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ.. ఆదిపురుష్ అంచనాలను మించిపోయింది. ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్లు రావటం ఇదే రికార్డు అని విశ్లేషకులు చెప్తున్నారు. రెండు వారాల్లో వెయ్యి కోట్లు కలెక్షన్లు సాధించగలదని సినిమా విడుదలకు ముందు అందరూ అంచనా వేశారు. ఫస్ట్ డే అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చినా.. రాబోయే రోజుల్లో ఇదే రేంజ్ లో కలెక్షన్లు ఉండే అవకాశాలు మాత్రం కనిపించటం లేదు.
రిలీజ్ ముందు భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఫస్ట్ డే టాక్ మాత్రం అంత పాజిటివ్ గా లేదు. సినిమా విజువల్ వండర్ అని అందరూ చెప్పారు.. కానీ విజువల్స్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకున్న డైరెక్టర్ ఓం రౌత్.. చాలా విషయాల్లో సొంత ప్రయోగాలు చేసి సినిమాను ట్రాక్ నుంచి పక్కకు తీసుకెళ్ళాడంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. మొదటి రోజు సాయంత్రానికి సినిమా గురించి పూర్తి ఓరల్ టాక్ నెగెటివ్ గానే వచ్చింది. ముఖ్యంగా సీతను రావణుడు అపహరించే సీన్ నిన్న సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యింది. అసలు రామాయణంలో సీతను రావణుడు అపహరించిన తీరు వేరు.. ఆదిపురుష్ లో చూపించింది వేరు. ఇక రావణుడి ఆహార్యాన్ని చూపించిన తీరే ఎవరికీ నచ్చలేదు. ఇదే కాదు.. సినిమాలో ఇంకా చాలా నెగెటివ్ పాయింట్స్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా సినిమాలోని పాత్రల మధ్య ఎంతో ఎమోషన్ ను చూపించే అవకాశం ఉన్నప్పటికీ.. క్యారెక్టర్ల మధ్య సినిమాటిక్ డ్రామా తప్ప ఎమోషన్ లేదనేది ప్రధాన విమర్శ. మొత్తానికి ఏదో అనుకుంటే ఆదిపురుష్ ఇంకేదో అయ్యేలా ఉంది. మిగతా రోజుల కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.