దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదానీ గ్రూప్ స్కామ్ ఆరోపణలపై అధినేత అదానీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన గ్రూప్ సంస్థలన్నింటిపై ఓ ప్రైవేట్ ఆడిటింగ్ సంస్థ చేత ఆడిట్ చేయించి తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం అని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇందు కోసం గ్రాంట్ థోర్న్ టన్ అనే ప్రైవేట్ ఆడిటింగ్ కంపెనీని ఎంపిక చేసుకొని.. నిష్పక్షపాతంగా ఆడిట్ చేసి రిపోర్ట్ ను షేర్ హోల్టర్ల ముందు ఉంచాలని కోరాడు. ఇప్పటికే ఈ కంపెనీకి కాంట్రాక్టు ప్రక్రియ అయిపోయినట్టు తెలుస్తోంది. అదానీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కొద్ది రోజుల క్రితం బ్రిటన్ కు చెందిన హిండెన్ బర్గ్ అనే షార్ట్ సెల్లింగ్ కంపెనీ అదానీ గ్రూప్ లో అక్రమాలు జరిగాయంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ రిపోర్ట్ విడుదల చేసింది. దీంతో అదానీకి చెందిన 120 బిలియన్ డాలర్లు క్షణాల్లో ఆవిరయ్యాయి. ప్రతిపక్షాలు అదానీ గ్రూపు తో పాటు మోడీపై తీవ్ర ఆరోపణలు చేశాయి.. మోడీ వల్లనే అదానీ ఇంత వాడు అయ్యాడనీ.. ఇప్పుడు అదానీ చేసిన కుంభకోణంతో లక్షల కోట్ల ప్రజా సంపద ఆవిరైందనీ ఆరోపించాయి. వెంటనే అదానీ వ్యవహారంపై ఈడీ, సీబీఐ ఎంక్వైరీ చేయాలంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రెండు రోజుల క్రితం అదానీ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు కమిటీ నియమిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు స్పష్టం చేసింది. ఈ క్రమంలో తన కంపెనీపై తానే ప్రైవేట్ ఆడిటింగ్ చేయించాలని అదానీ నిర్ణయించుకోవటం మరో సంచలనంగా మారింది.
