మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఇది. మార్చిలో చిరంజీవి, రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ కు సిద్ధమయ్యాయి. చిరంజీవి కెరీర్ లో మరిచిపోలేని కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయిన గ్యాంగ్ లీడర్ సినిమాను 4కే రిజల్యూషన్ తో రీ రిలీజ్ చేయనున్నారు. మార్చి 4 రోజున గ్యాంగ్ లీడర్ కొత్త ప్రింట్లు థియేటర్లో మెగా అభిమానులను అలరించనున్నాయి. గ్యాంగ్ లీడర్ సినిమాతో పాటు మరో వీడియో కూడా ప్రదర్శించనున్నారు. చిరంజీవి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరు మాట్లాడిన ఓ వీడియో.. గ్యాంగ్ లీడర్ సినిమాతో పాటు ప్రదర్శిస్తారట.
ఇక రామ్ చరణ్ కూడా రీ రిలీజ్ సినిమాతో ఫ్యాన్స్ ను అలరించనున్నాడు. టాలీవుడ్ రికార్డులను తిరగరాసి.. రామ్ చరణ్ కు ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన రాజమౌళి సినిమా మగధీర మార్చి 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. ఒకే నెలలో తండ్రీ కొడుకులిద్దరూ రీ రిలీజ్ సినిమాలతో మెగా ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నారన్నమాట.
గ్యాంగ్ లీడర్, మగధీర రెండు సినిమాలూ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ సినిమాలు. గ్యాంగ్ లీడర్ కోసం బప్పీ లాహిరి అందించిన మ్యూజిక్ తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. బప్పీ లాహిరి వెస్టర్న్ స్టైల్లో కొట్టిన కొట్టుడుకు ప్రేక్షకులు ఊగిపోయారు. అప్పట్లో బిగ్ మ్యూజికల్ హిట్ గా నిలిచిన గ్యాంగ్ లీడర్ సినిమా పాటలు ఇప్పటికీ జనం వింటూనే ఉన్నారు. ఇక మగధీర కూడా మంచి మ్యూజికల్ హిట్. ఎంఎం కీరవాణి అందించిన సంగీతం అద్భతం. ముఖ్యంగా పంచదార బొమ్మ పాట కొన్ని యేళ్ళ పాటు అలరించింది. మొత్తానికీ రెండు రీ రిలీజ్ సినిమాలతో మార్చి నెల టాలీవుడ్ కు బిజీ నెలకానుంది.