ఎన్నికల వేళ కర్ణాటకలో ఫ్రీ పథకాల ప్రచారం జోరందుకుంది. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత కుమారస్వామి ఓ విచిత్రమైన పథకాన్ని అనౌన్స్ చేశారు. రైతు కొడుకును పెళ్ళి చేసుకున్న అమ్మాయికి ప్రభుత్వం తరఫున 2 లక్షల బహుమతి అందజేస్తామని సరికొత్త పథకాన్ని ప్రకటించాడు కుమారస్వామి. రైతుల కొడుకులను పెళ్ళి చేసుకునేందుకు అమ్మాయిలు ఆసక్తి చూపించటం లేదనీ.. కాబట్టే రైతుల ఆత్మాభిమానాన్ని పెంచటానికి.. వారి విలువ అమ్మాయిలకు తెలిసి రావటానికే ఈ పథకాన్ని ప్రకటించానంటూ క్లారిటీ ఇచ్చాడు కుమార స్వామి.
నిన్న కోలార్ లో జరిగిన పంచరత్న ప్రచార ర్యాలీలో కుమారస్వామి కొత్త పథకాన్ని ప్రకటించారు. రైతుల కుమారులను పెళ్ళి చేసుకోటానికి ఈ కాలం అమ్మాయిలు ఆసక్తి చూపటం లేదని.. ఏదో ఒకటి చేయండి అంటూ తనకు కొంత మంది రైతులు వినతి పత్రం అందజేశారనీ.. అందుకే ఈ పథకాన్ని ప్రకటించానని క్లారిటీ ఇచ్చాడు.
మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఇప్పటికే జేడీఎస్ 93 మంది పేర్లతో అభ్యర్థుల జాబితా విడుదల చేయగా.. బీజేపీ మాత్రం ఇంకా కుస్తీలు పడుతూనే ఉంది. కర్ణాటక బీజేపీ అగ్రనేతలు యడ్యూరప్ప, బస్వరాజ్ బొమ్మ, నళిన్ కుమార్ నాలుగు రోజులుగా ఢిల్లీలోనే బీజేపీ అధిష్టానంతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తన తొలి జాబితా ఇప్పటికే విడుదల చేయగా.. బీజేపీ ఈ రోజు రాత్రికల్లా తొలి జాబితా విడుదల చేస్తామని చెప్పింది. ఎన్నికల వేళ.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ఇంకా ఏం విచిత్రమైన పథకాలు ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.