తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ స్థాయుల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. సోమవారం హైదరాబాద్ లోని పాతబస్తీ పేట్ల బురుజు హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన హరీష్ రావు ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలన్నింటిలో ఉన్న ఖాళీలను ఏకకాలంలో భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. ప్రజారోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులు కేటాయించిందని ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలతో పాటు బస్తీ దవాఖానాల ఏర్పాటుతో తెలంగాణ ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేస్తోందని ఆయన చెప్పారు.