బాలాసోర్ రైలు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ బాధితుల కోసం ఓ నేరస్తుడు ఏకంగా 10 కోట్ల రూపాయల నష్ట పరిహారం ఇస్తానంటూ రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు లేఖ రాశాడు. ఆ నేరస్తుడు ఎవరో కాదు.. మనీ లాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేశ్ చంద్రశేఖర్. 200 కోట్ల రూపాయల గోల్ మాల్ కేసులో ఇతడిని ఈడీ అరెస్టు చేసి జైళ్ళో పెట్టింది. ప్రస్తుతం జైల్లో ఉన్న సుకేశ్.. తన వద్ద ఉన్న లీగల్ సొమ్ము నుంచే రైలు ప్రమాద బాధితులకు నష్ట పరిహారం అందజేస్తాననీ.. అక్రమంగా సంపాదించిన డబ్బు కాదనీ చెప్తున్నాడు. ఇందుకు సంబంధించి ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశాడు సుకేశ్. ఆ పది కోట్లకు సంబంధించిన అన్ని లీగల్ డాక్యుమెంట్లు ప్రభుత్వానికి చూపిస్తాననీ.. ఇన్ కమ్ ట్యాక్స్ కూడా చెల్లించిన తర్వాతే ఆ సొమ్మును స్వీకరించాలని కూడా చెప్తున్నాడు. రైలు ప్రమాదంలో 289 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మృతుల కుటుంబాలతో పాటు గాయపడిన వారికి 10 కోట్ల సొమ్మును విభజించి పంచాలని కోరుతున్నాడు.
రాన్ బాక్సీ ఫార్మా కంపెనీకి చెందిన ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివీందర్ సింగ్ అనే ఇద్దరు జైలు శిక్షకు గురయ్యారు. అయితే.. వీళ్ళకు బెయిల్ ఇప్పిస్తానని చెప్పి ఇద్దరి దగ్గర కలిపి సుసమారు 200 కోట్లు వసూలు చేశాడనేది సుకేశ్ పై ఈడీ మోపిన అభియోగం. ఈ కేసులోనే అరెస్ట్ అయ్యి తీహార్ జైళ్ళో ఉన్నాడు. బాలీవుడ్ నటి జాక్విలీన్ ఫెర్నాండెజ్ ను జైలుకు పిలిపించుకొని తన సరదా తీర్చుకున్నాడు ఈ ఘనుడు. ఇందుకు గానీ జైలు అధికారులకు భారీగా సొమ్ము ముట్టజెప్పినట్టు ఆరోపణలు వచ్చాయి. జైలు నుంచే జాక్వలీన్ కు ప్రేమలేఖలు రాయటం.. పుట్టినరోజున కానుకలు పంపడం చేస్తుంటాడు సుకేశ్. తనకు జైళ్ళో రక్షణ కల్పిస్తానని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు తన వద్ద 10 కోట్లు తీసుకున్నాడని సంచలన ఆరోపణ చేశాడు. జైళ్ళో ఉన్న ఈ ఆర్థిక నేరస్తుడు శారదా ట్రస్టు పేరుతో ప్రజల కోసం వివిధ సహాయక కార్యక్రమాలు చేయటం.. చిన్న పిల్లలు, అనాధల కోసం సేవా కార్యక్రమాలు చేయటం చాలా మందికి తెలియని విషయం.