వర్గ పోరుతో సతమతమవుతున్న బీజేపీలో ఈ సారి పెద్ద తుఫానే వచ్చినట్టు కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పక్కన పెట్టి ఈటెల రాజేందర్ కు పగ్గాలు అప్పజెప్తారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఈటెల రాజేందర్ ఢిల్లీకి వెళ్ళి రావటంతో ఈ వార్తలకు మరింత బలం వచ్చింది. కానీ ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. బండి సంజయ్ ను తప్పించే ప్రసక్తే లేదంటూ క్లారిటీ ఇవ్వటంతో ఈ వార్తలకు బ్రేక్ పడింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలో పెట్టాయి. ఈటెల రాజేందర్ మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి రావాలంటూ బహిరంగంగా ఆహ్వానించటంతో ఇక వీళ్ళిద్దరూ కాంగ్రెస్ లోకి వెళ్ళటం ఖాయం అనే అంచనాలు కనిపించాయి.
కానీ.. తాను పార్టీలు మారే వ్యక్తిని కాదంటూ ఈటెల ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పదేళ్ళుగా పార్టీ కోసం పని చేస్తున్నాననీ.. తెలంగాణ బీజేపీలో ముఖ్య పదవి తనకు ఎందుకు ఇవ్వరో చెప్పాలంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రఘునందన్ రావు వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో ఉన్న వర్గ పోరును తేటతెల్లం చేశాయి. పార్టీలో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అనే విభేధాలు ఉన్నాయనేది ఇప్పుడు బహిర్గమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ జాతీయ అధిష్టానం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించబోతున్నదంటూ వచ్చిన వార్తలు బీజేపీని షేక్ చేస్తున్న వేళ.. “నాకు మాత్రం పదవులపై ఆశ ఎందుకు ఉండకూదడు.. నేను పదేళ్ళ నుంచి పార్టీకి సేవ చేస్తున్నాను.. పదవి ఆశిస్తే తప్పేమిటి.. నాకు కూడా ప్రధాన పదవి ఇస్తే తప్పేముంది.. నేను అర్హుడిని కానా.. పార్టీలో నాకు సరైన గౌరవం ఆశించటం తప్పా..?” అంటూ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు బీజేపీని మరింత డ్యామేజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
“దుబ్బాక నియోజకవర్గంలో అమిత్ షా ప్రచారం చేయలేదు.. బీజేపీ నేతలు ఎవ్వరూ నాకు దుబ్బాకలో గెలవటానికి సాయం చేయలేదు.. నేను నా సొంత చరిష్మాతో గెలిచాను..” అంటూ కేంద్ర అధినాయకత్వంపై కూడా రఘునందన్ రావు విమర్శలు చేశాడు. సాధారణంగా సొంత పార్టీ గురించి గానీ.. వర్గపోరు గురించి గానీ ఎప్పుడూ నెగెటివ్ గా మాట్లాడని రఘునందన్ రావు.. ఈ సారి ఇలా ఫైర్ అయ్యాడు. వర్గపోరు వీడి కలిసి పనిచేయకపోతే.. ఇప్పుడు ఉన్న ఓటు బ్యాంకు కూడా బీజేపీకి దూరం కావటం ఖాయమే.