ఐక్యరాజ్యసమితిలో భారత్ కు షాకిచ్చిన నిత్యానంద శిష్యురాలు

నిత్యానంద స్వామి.. పేరుకు తగ్గట్టే నిత్యం నవ్వుతూ కనిపించే ఈయన స్వయంప్రకటిత స్వామీజీ. ఇంకాస్త డీటెయిల్డ్‌గా చెప్పాల్సొస్తే ఈయనదగ్గరకొచ్చే భక్తులకు దేవుడు. బయటి సమాజానికి మాత్రం కాషాయ ముసుగులో కంత్రీ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న కన్నింగ్ స్వామీజీ. దాదాపు పదమూడేళ్ల క్రితం నిత్యానంద బండారం అతడి డ్రైవర్ ద్వారానే బట్టబయలైంది. 2010లో నిత్యానంద లీలలివే అంటూ ఆయన మాజీ డ్రైవర్ లెనిన్ పోలీసు లకు ఫిర్యాదు చేశారు. కట్‌చేస్తే.. నిత్యానంద అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలు దేశంలోనే టాప్ హెడ్‌లైన్స్‌లో నిలిచాయి. ఈ క్రమంలో తనపై వచ్చిన లైంగిక ఆరోపణలన్నీ అవాస్తవాలే అనీ, తానసలు మగాడినే కాదంటూ మరో సంచలనానికి తెరలేపారు సదరు స్వామీజీ. ఇక దీనిమీద దేశంలో జరిగిన డిబెట్ అంతా ఇంతా కాదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే స్వయంప్రకటిత స్వామీజీకి బెయిల్ వచ్చింది. ఆ తర్వాత నిత్యానంద మిస్సింగ్ వార్త ఓ సంచలనమై కూర్చుంది. ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత కైలాస దేశం అంటూ సాములోరు సృష్టించిన అలచడయితే అంతా ఇంతా కాదు.


నిత్యానంద కైలాస దేశం ప్రకటన తర్వాత గూగుల్ సెర్చ్‌ ఇంజిన్ షేక్ అయిపోయింది. దేశం దాటేసిన ఈ కేటుగాడు ఓ దేశాన్ని సృష్టించడమేంటి? దానికో కొత్త కరెన్సీని తేవడమేంటనే ప్రశ్నలతో గూగులమ్మ గగ్గోలుపెట్టే రేంజ్‌లో సెర్చింగ్ జరిగింది. ఓ దీవిని కొనడం, దానికి కైలాస దేశంగా నామకరణం చేయడం, ఆ దేశానికి తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించడం లాంటి పరిణామాలతో నిత్యానంద మరోసారి హెడ్‌లైన్స్‌‌లో నిలిచారు. అయితే, నిత్యానంద ప్రకటించిన కైలాస దేశం ఎక్కడుందో ఇప్పటికీ ఎవ్వరికీ పూర్తిగ తెలియలేదు. అది ఈక్వెడార్‌‌కు సంబంధించిన దీవుల్లో ఒకటనే చర్చ గతంలో జరిగింది. కానీ, ఈక్వెడార్ మాత్రం కైలాసమును తమ నుంచి కొనుగోలు చేసిన భూభాగంలో నిత్యానంద ఏర్పాటు చేశారన్న వార్తలపై తూచ్ అంది. ఐతే, నిత్యానంద తమను ఆశ్రయం కోరినమాట నిజమేననీ.. శరణార్థిలా మా దేశంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకొన్నట్టు చెప్పింది. దాన్ని కూడా తాము తిరస్కరించినట్టు ఈక్వెడార్‌ అప్పట్లో ప్రకటించింది. ఆ తర్వాత నిత్యానంద కరేబియన్ దీవుల్లో ఒకటైన హైతీకి తరలిపోయినట్టు తెలుస్తోందంటూ భారత్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయం ప్రకటించింది. అదికూడా నిజమో కాదో తెలీని పరిస్థితి.


నిత్యానంద లైంగిక వేధింపులకు పాల్పడ్డారా.. లేదా? అనేది అప్రస్తుతం. అతనిపై కేసు మాత్రం నిజం. ఇదే సమయంలో సదరు స్వామీజీ వీడియోలను చూసినా సాములోరి సరసభోగాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలుస్తుందనే చర్చ కూడా ఉంది. అలా తనపై వచ్చిన ఆరోపణల్ని తానసలు మగాడినే కాదు, ఓ నపుంసకుడిననీ, అలాంటి తాను లైంగిక వేధింపులెలా చేస్తానని వాదించిన వ్యక్తి.. ఇక్కడే ఉండి నిజం ఏంటో తేల్చాల్సిన వ్యక్తి దేశం విడిచి పారిపోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఇప్పటికీ మిలియన్ మార్క్ మిస్టరీనే. ఇక ఈ సాములోరు దేశం దాటేసిన చాన్నాళ్ల తర్వాత కొత్త దేశం ప్రకటిస్తే దాన్నెవరూ పట్టించుకోలే దు. తన దేశానికి జెండా ఉందని, రిజర్వ్ బ్యాంకు ఉందని, సొంత కరెన్సీ, పాస్‌పోర్టు కూడా తెచ్చామంటే, అదొక ప్రచారమేనని తేలిగ్గా తీసిపారేశారు. కానీ, ఇప్పుడు కైలాస దేశం నాన్సెన్స్ కాదని ప్రపంచం మొత్తానికీ తెలిసేలా నిత్యానంద శిష్యులు ఏకంగా ఐక్యరాజ్యసమితికి చెందిన కమిటీ ఆన్ ఎకనమిక్స్ సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. జెనీవాలో జరిగిన ఈ సమావేశంలో కైలాస దేశం తరఫున విజయప్రియ హాజరయ్యారు. ఈ పరిణామం తర్వాతే నిత్యానంద కైలాస దేశంపై అంతకుమించిన చర్చ మొదలైంది.


తనను తాను ఐక్యరాజ్యసమితిలో కైలాస దేశ శాశ్వత ప్రతినిధిగా పరిచయం చేసుకున్న విజయప్రియ.. మొదట కైలాస దేశ విశిష్టతను వివరించారు. కైలాస దేశం హిందువుల కోసమే ఏర్పడిన మొట్ట మొదటి సార్వభౌమ దేశమని తెలిపారు. తమ దేశాధినేత పేరు నిత్యానంద పరమశివం అన్నారు. నిత్యానంద పరమశివం పరమావధి హిందూ మత పునరుజ్జీవం అని స్పష్టం చేశారు. ఇక్కడే మరో వ్యాఖ్య చేశారు. తమ సుప్రీమ్ నిత్యానందను ఆయన పుట్టిన మాతృదేశమే వేధిస్తోందనీ, శిక్షించాలనీ భావిస్తోందనీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో ప్రపంచ సమాజం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అసలే ఐక్యరాజ్యసమితికి చెందిన కమిటీ ఆన్ ఎకనమిక్స్ సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ వరకూ ఈ కన్నింగ్ స్వామీజీ కంట్రీ ఎలా చేరిందనే చర్చ జోరందుకున్న వేళ.. ఏకంగా భారత్‌నే టార్గెట్ చేయడం లాంటి పరిణామాలు ప్రపంచానికే ఆశ్చర్యం కలిగించాయి.


నిత్యానంద మీద కేసు ఏ కండిషన్‌లో ఉందనేది పెద్ద విషయం కాదు. కానీ, క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొని దేశం విడిచి పారిపోయిన వ్యక్తి ఓ దీవిని కొని, దాన్నో దేశంగా ప్రకటించి, ఐక్యరాజ్యసమితిదాకా వెళ్లిపోవచ్చా? అలా అయితే, ఎవరైనా కరుడుగట్టిన టెర్రరిస్టుగనుక ఇలానే ఓ ఊహాత్మక దేశం స్థాపించినట్టు ప్రకటిస్తే ఐక్యరాజ్యసమితి గుర్తిస్తుందా? రక్షణగా నిలుస్తుందా? అనేవి ఆలోచించాల్సిన విషయాలు. ఇదే టైంలో యూఎన్ సమావేశానికి కైలాస దేశానికి ఆహ్వానం ఎవరు పంపారు? ఏ అడ్రెస్‌కు పంపించారనేదీ అంతుచిక్కని మిస్టరీగానే మారింది. ఐతే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలు లాజిక్ వేరే ఉంది. జెనీవా సమావేశానికి హాజరయినంత మాత్రాన కైలాస దేశానికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు ఉన్నట్టు కాదు. ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందాలంటే భద్రతా మండలి, సర్వప్రతినిధి సభ ఆమోదం ఉండాలి. 193 దేశాల జాబితాలో కైలాస దేశం లేనేలేదు. ఐక్యరాజ్యసమితికి చెందిన కమిటీ ఆన్ ఎకనమిక్స్ సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ లాంటి సమావేశాలకు వెళ్లడానికి చాలా మార్గాలుంటాయి. ఇందులో సదరు కైలాస దేశానికి దొరికిన ఒక దారి అమెరికా.


కైలాస దేశంతో అమెరికాలోని నెవార్క్ సిటీ ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇలా నెవార్క్‌తో ద్వైపాక్షిక ఒప్పందాన్ని చూపించి ఐక్యరాజ్యసమితికి చెందిన కమిటీ ఆన్ ఎకనమిక్స్ సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ సమావేశానికి ఆహ్వానం తెచ్చుకుని ఉండొచ్చు. ఒకరకంగా జెనీవా చర్చల్లో కైలాస ప్రతినిధి పాల్గొనడం ద్వారా ఐక్యరాజ్యసమితి గుర్తింపు తమకు దొరికేసిందని ప్రచారం చేసుకోడం ద్వారా ఇక తమ దేశాన్ని ప్రపంచం అంతా గుర్తించేలా చేసే కమర్షియల్ ప్రయత్నాలే ఇవన్నీ అన్నమాట. ఇదే టైంలో తాజా సమావేశంలో భారత్‌ను టార్గెట్ చేయడానికీ ఓ కారణం కనిపిస్తోంది. ఇండియాలో నిత్యానందపై ఉన్న కేసుల కారణంగా కైలాస అడ్రస్ తెలిస్తే అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. సో.. వీలైనంత త్వరగా కైలాస దేశాన్ని ప్రపంచం గుర్తిస్తే ఆ ప్రమాదం నుంచి కూడా తప్పించుకోవచ్చనేది స్వయంప్రకటిత స్వామీజీ కన్నింగ్ ప్లాన్‌గా భావిస్తున్నారు. మొత్తంగా.. ఐక్యరాజ్యసమితికి చెందిన సమావేశంలో నిత్యానంద శిష్యులు కనిపించడం మాత్రం ఆషామాషీ ఏం కాదు.