అమెరికా అధ్యక్ష రేసులో మరో ఇండియన్..! ఎవరో తెలుసా ?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి పోటీ చేయనున్నాడు. అమెరికాలో ప్రముఖ వ్యాపార వేత్త అయిన ఇండియన్ ఆరిజిన్ వివేక్ రామస్వామి ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నానని ప్రకటించాడు. రిపబ్లికన్ పార్టీ నుంచి తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని చెప్పాడు. ఇప్పటికే ఇండియన్ ఆరిజిన్ నిక్కీ హేలీ యూఎస్ఏ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. 37 సంవత్సరాల వివేక్ రామస్వామి.. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలిచిన అందరిలోనీ చిన్నవాడు. వివేక్ తల్లిదండ్రులు వివేక్ పుట్టక ముందే కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్ళారు. ఓహయోలో 1985 ఆగష్ట్ 9న వివేక్ జన్మించారు. ప్రస్తుతం అమెరికాలోని భారతీయ వ్యాపార ప్రముఖుల్లో వివేక్ కూడా ఒకరు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన వివేక్.. అమెరికా ఉన్నత ఆదర్శాలను తిరిగి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకోవటానికి నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ప్రపంచంలో చైనా వంటి దేశాలతో అమెరికాకు ఉన్న ముప్పును తొలగించే మార్గం వెతకాల్సి ఉందన్నారు. స్ట్రైవ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థను నిర్వహిస్తున్న వివేక్.. అంతకు ముందు ఫార్మా రంగంలో రాణించారు. 2016లో ఫోర్బ్స్ లెక్కల ప్రకారం వివేక్ మొత్తం ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లు. ఒక వేళ వివేక్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే.. ట్రంప్ తర్వాత రిచెస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ అవుతాడు.